ముఖ్యమంత్రికి బొజ్జ దశరథ రామ్ రెడ్డి లేఖ
♦️సాగునీటి బడ్జెట్ లో 42 శాతం నిధులు రాయలసీమకు కేటాయించాలి.
# రాయలసీమ సమానాభివృద్దికి కార్యాచరణ చేపట్టాలి.
---- ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల అక్టోబర్ 11 (రిపబ్లిక్ న్యూస్):
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో చెడును పారద్రోలుతూ, మంచి దిశగా చేపట్టే కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు.
చెడుపై మంచి గెలుపుకు ప్రతీకగా నిర్వహించే దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ రాయలసీమ సమానాభివృద్దికి కావలసిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బొజ్జా లేఖ వ్రాసారు. ఈ సందర్భంగా శుక్రవారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ...
"రాయలసీమలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాయలసీమ సాగునీటి రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోతోముఖాభివృద్ధి చెందేలాగా, విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుందన్న భావనతో సాగునీటి రంగానికి సంబంధించి కొన్ని గణాంకాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణంలో మరియు వ్యవసాయోగ్యమైన భూమిలో రాయలసీమ 42 శాతం కలిగి ఉంది.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో 44 శాతం (రాష్ట్ర సగటు) భూమికి, సాగునీరు అందించేలాగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది.
3. రాయలసీమలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 21 శాతం (రాష్ట్ర సగటులో సగానికి దిగువగా) భూమికి, సాగునీరు అందించేలాగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది.
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో 30 శాతం (రాష్ట్ర సగటు) భూమికి, నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభిస్తున్నది.
5. రాయలసీమలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 9 శాతం (రాష్ట్ర సగటులో చాలా తక్కువగా) భూమికి, నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభిస్తున్నది.
గత పాలకుల తప్పిదాల వల్ల రాయలసీమకు జరిగిన చెడును సరిదిద్ది మంచి జరిగే లాగా, దసరా పండుగ సందర్భంగా “సంకల్పం” చేపట్టాలని బొజ్జా విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర సమగ్రతకు, సమగ్రాభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో 42 శాతం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణంలో / వ్యవసాయోగ్యమైన భూమిలో రాయలసీమకు ఉన్న నిష్పత్తికి సమానంగా) నిధులను రాయలసీమ సాగునీటి రంగానికి కేటాయింపు దిశగా తొలి అడుగు వేయాలని కోరారు. తద్వారా నిర్వీర్యమైన రాయలసీమ సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టే కార్యాక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలనీ, రాయలసీమ సమానాభివృద్ధి సాధించే దిశగా రాష్ట్ర విభజన చట్టంలో కల్పించిన బుందేల్కండ్, కోరాపుట్, బోలంగీర్ తరహా ప్రత్యేక ప్యాకేజీ నిధులను కేంద్రం నుండి సాధించి, రాయలసీమను సమానాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలని చంద్రబాబునాయుడుకి విజ్ఞప్తి చేసారు.
రాయలసీమలో ఏర్పాటుచేసిన కార్యాలయాల తరలింపును విరమించుకుని, వాటిని ఇక్కడే కొనసాగించాలనీ, అలాగే చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన విధంగా హైకోర్టు, సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్, వీటిలో భాగంగా ఏపీ సీడ్స్, ఏపీ విత్తన ధ్రువీకరణ ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరిచిన జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ కమిషనరేట్, తదితర మౌళిక వసతుల ఏర్పాటుకు తక్షణమే చేపట్టాలని కోరారు. కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.