డా.ఎన్టీఆర్ వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే చర్యలు
10 కేసులకు రూ.1.54 లక్షలు జరిమాన
డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి
కడప, సెప్టెంబర్ 05 (రిపబ్లిక్ న్యూస్) : ఎన్టీఆర్ వైద్య సేవల నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఆరోగ్య సేవలు పొందిన వారి నుంచి ఫిర్యాదులు వస్తే ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించి ఆసుపత్రులపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులపై సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యం తో కలెక్టర్ విచారణ చేసి జరిమానాలు విధించారు. కడపలో హోలిస్టిక్, తిరుమల, సన్ రైజ్ ఆసుపత్రులు, ప్రొద్దుటూరులోని కేవీఆర్ ఆసుపత్రి, పులివెందులలోని శ్రీ రాజా రాఘవేంద్ర ఆసుపత్రి మొత్తం ఐదు నెట్వర్క్ ఆస్పత్రుల్లో 14 ఫిర్యాదులు వచ్ఛాయని ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ బాలాంజనేయులు కలెక్టర్ కు తెలిపారు. ఇందులో ఎక్కువ కేసులు లబ్ధిదారుడి నుంచి డబ్బులు తీసుకొని వైద్యం అందించారని ఫిర్యాదులు అందాయని ఆయన కలెక్టర్ కు విన్నవించారు.ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.నిబంధనల మేరకు డా.ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తి ఉచితంగా, మెరుగైన ట్రీట్మెంట్ ను అందించాలి కానీ మీ పై అభియోగాలుఅందాయన్నారు.డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు రీఫండ్ చేయాల్సి వచ్చిందన్న అంశంపై సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాన్ని కలెక్టర్ ప్రశ్నించారు. ఆస్పత్రికి వచ్చేలోపలే ప్రాథమికంగా కొన్ని పరీక్షలు చేసుకొని కొంత మొత్తం ఖర్చుచేసి వస్తున్నారని, ఆ మొత్తాన్ని తిరిగిచెల్లించినప్పటికీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నారని ఆస్పత్రుల ప్రతినిధులు కలెక్టర్ కు తెలిపారు దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఉచిత వైద్యం అందించాలని, ఎన్టీఆర్ వైద్య సేవల లబ్ధిదారులకు ఇబ్బంది కల్గించే ఏ చర్యలైనా తప్పుగానే పరిగణించడం జరుగుతుందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న తరువాత అయిదు ఆసుపత్రులకు సంబంధించి మొత్తం 14 కేసులలో 10 కేసులకు రూ.1.54 లక్షలు పెనాల్టీ చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన 4 కేసులకు సంబంధించి ఆసుపత్రుల వారి తరపున తగిన అధారాలు ఉన్నందున హెచ్చరించి కొట్టి వేశారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా.నాగరాజు, డిసిహెచ్ఎస్ డా.హిమదేవి, ఏడీ ఐ&పీఆర్ వేణుగోపాల్ రెడ్డి, డీఎం రమేష్ బాబు, ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.